28, నవంబర్ 2016, సోమవారం

ఆహ్వానము

కాకతీయ పద్య కవితా వేదిక, వరంగల్

అవధాన రాజహంసిని, శతావధాన విశారద
కుమారి పుల్లాభట్ల నాగశాంతి స్వరూప గారిచే
(తెలుగు అధ్యాపకురాలుఆంధ్ర యువతీ సంస్కృత కళాశాలరాజమహేంద్రవరము)

అష్టావధానము

వేదిక : రైజింగ్ సన్ హైస్కూల్, వాసవి కాలనీ రోడ్, కొత్తవాడ, వరంగల్
తేదీ : 04-12-2016 (ఆదివారం); సమయం : ఉదయం 10-00 గం.లకు.

అధ్యక్షులు             : Ln. తమ్మెర లక్ష్మీనరసింహరావు గారు, MJF., T 20 F.,
సమన్వయ కర్త       : డా॥ ఇందారపు కిషన్ రావు గారు, (ప్రముఖ అష్టావధాని)
ముఖ్య అతిథి         : శ్రీ ఆరుట్ల భాష్యాచార్య గారు, (ప్రముఖ పద్యకవి)
విశిష్ట అతిథి          : డా॥ టి. శ్రీరంగస్వామి గారు, (శ్రీలేఖ సాహితి, వరంగల్)

పృచ్ఛకులు
నిషిద్ధాక్షరి                 : శ్రీ గుండు మధుసూదన్ గారు
సమస్య                    : శ్రీ జీడికంటి శ్రీనివాస మూర్తి గారు
దత్తపది                   : శ్రీ కంది శంకరయ్య గారు
వ్యస్తాక్షరి                 : శ్రీమతి బోయినిపల్లి రాధ గారు
వర్ణన                      : డా॥ పాతూరి రఘురామయ్య గారు
ఆశువు                    : శ్రీ చేపూరి శ్రీరామ్ గారు
ఘంటావధానము        : చి॥ యం. వెంకటలక్ష్మి
అప్రస్తుత ప్రసంగము    : డా॥ పల్లేరు వీరస్వామి గారు


అందరూ ఆహ్వానితులే!

ప్రాయోజకులు :
     శ్రీ రామడుగు షణ్ముఖాచారి గారు,       


ప్రిన్సిపాల్, రైజింగ్ సన్ హైస్కూల్, వరంగల్.


30, అక్టోబర్ 2016, ఆదివారం

నరకాసుర సంహారం...దీపావళి! [పద్యకథ]

images of the death of narakasura by satya కోసం చిత్ర ఫలితం

అల హిరణ్యాక్ష సంహార కలన వసుధ
నోమిన హరిసాంగత్యాన భూమి కపుడు
కడుపు పండంగ నరకునిఁ గనియు నతని
కిడెను ప్రాగ్జ్యోతిషపురము నుడుగరగను!
.
బాణు స్నేహాన నతఁడు దుర్వర్తనుఁడయి
దుష్కృతమ్ములఁ జేయుచు దుండగమున
మునుల బాధించుచుండెను ఘనుఁడ నంచుఁ
దనను మ్రొక్కంగఁ గోరుచుఁ దఱుముచుండి!
.
ఒక్కనాఁడు వసిష్ఠుండు మ్రొక్కుటకయి
యరిగెఁ బ్రాగ్జ్యోతిషంపుఁ గామాఖ్య దేవి
మందిరమునకు; నంత భూమాత సూనుఁ
డాలయమ్మును మూసినయంత మౌని;
.
"ఓరి! మదగర్వమున రేఁగి యుర్వియందు
సజ్జనుల పరిభవమున సంతసమునుఁ
బొందుచుంటివి కావునఁ బొందెదవుర
మృతిని త్వజ్జన్మ కర్తయౌ పితరువలన!"
.
శాపమును విని నరకుండు జడిసి నలువ
కయి తపమ్మొనరించి యా కమలజుని ప్ర
సన్నుఁ గావించి దేవ రాక్షసుల చేత
మరణ మందకుండఁగ ఘన వరముఁ బొందె!
.
తద్వర జనిత గర్వ విస్తారుఁడయ్యు
దేవతల జయించియును, యతీశ్వరులకు
బాధ లిడి, షోడశ సహస్ర భామినులను
బంధితులఁ జేసి, చెలరేఁగె భయము లేక!
.
మునులు దేవతల్ హరికిని మొఱలు వెట్టి
నరకుఁ జంపి, బాధలఁ దీర్ప వర మడిగిరి!
సత్వరముగ శ్రీకృష్ణుండు సమరమందు
నరకుఁ జంపంగఁ బూని తా నరుగుచుండ;
.
అపుడు సాత్రాజితియె తోడ నరుగుఁదెంతు
ననుచు వేడి శ్రీకృష్ణుని ననుసరించి
వెడలె యుద్ధమ్మునకుఁ దాను వీరవనిత
పగిది వీరత్వ మెల్లెడఁ బల్లవింప!
.
అపుడు వెన్నుండు గరుడుని నాత్మఁ దలఁప,
నెదుట నిలఁబడ, సతితోడ నెక్కి తాను
వెడలి ప్రాగ్జ్యోతిషమునకు వీఁకతోడ,
నరకు రావించె ననిసేయ నచటి కపుడు!
.
ఆగ్రహోదగ్రుఁడై వాఁ డహంకరించి,
యగ్గిపైగుగ్గిలము వేయ భగ్గుమనెడి
రీతి నేతెంచి మార్కొని కృష్ణునపుడు,
పలువిధమ్ముల బాణాలు వదలి యెగసె !
.
కృష్ణుఁ డంతట నస్త్రశస్త్రోష్ణ సహిత
యుద్ధవిక్రమోర్జిత సుబలోన్నతుఁడయి
నరకుఁ దాఁకెను సత్య తననుఁ గనంగ
విశ్వమోహన రూపాన విహసితుఁడయి!
.
కాల్బలములు కరులు తురగములు తేరు
లన్ని ఖండతుండమ్ములు నయ్యె నంత
నరకుఁ డొక సాయకము వేయ నందసుతుని
తలకుఁ దాఁకియు మూర్ఛిల్లె దానవారి!
.
సత్యభామయె పృథ్వ్యంశ జనిత యగుట
కతనఁ జక్రియే మాయా ప్రకాశకుఁ డయి
మూర్ఛ నటియించె! భర్త సమ్మూర్ఛితుఁడయి
నంత సేదఁదేఱిచి సత్య యనికిఁ బూని!
.
ఒక్క కంటను హరిని నింకొక్క కంట
వైరిఁ జూచుచు శృంగార వీరములును
స్నేహ రోషాలు ముఖమునఁ జిందులాడ
ధనువు నంది విజృంభించెఁ ద్వరఁగ సత్య!
.
రోష రోహిత సందీప్త లోచనయయి,
నరకు సరకు సేయక, వేసి శరములెన్నొ,
కలఁత వడఁజేయఁగాఁ బ్రతీకార ముడిగి,
వాఁడె యప్రతిభుండయి వఱలె శిలగ!
.
అంతఁ జక్రియుఁ జక్రమ్ము హస్తమునను
గొనియు భూసుతుఁ దలఁ దెగఁ గొని నిలువఁగఁ,
గనిన సత్య మూర్ఛిల్ల, భూకాంత పొడమి,
కొమరుఁ జంపిన పతిఁగని, నుడివె నిట్లు;
.
"స్వజుని దుష్కృతాల్ సైరించి, వాని చరిత
జనులు చెప్పుకొనఁగఁ జిరస్థాయిగాను
నిల్పు మో దేవ!" యన, హరి "నేఁటి నుండి
జనులు "నరక చతుర్దశి" జరుపుకొండ్రు!
.
వాఁడు ప్రాచీదిశోదయ ప్రభల నాపి,
లోకులను జీఁకటినిఁ ద్రోచి, శోకమిడెను;
గాన, నేఁడు దీపమ్ముల ఘనముగాను
పూన్చి "దీపావళీ పర్వము" జరిపెదరు!
.
ఇట్లె ప్రతియేఁట లోకులు హితకరముగ
నాశ్వయుజ కృష్ణపక్షంపు టమవస తిథి
దీపము ల్వెలిఁగించి యీ దిశలు వెలుఁగఁ
గాను దీపావళియె వెల్గుఁ గరువుదీఱ!"
.
అనఁగఁ బృథ్వి యంతర్హిత యగుడు, సత్య
మూర్ఛఁ దేఱియు, మగని నెమ్మోముఁ గనుచు,
విజయ కాంతులు ముఖమున వెల్లివిఱియ,
స్వీయ నగరికిఁ జనెఁ గుజద్విషునితోడ!
.
ఫలశ్రుతి:
"నరక సంహార కథ" వినినం జదివిన
జనుల కెపు డాయురారోగ్య సంపదలును
కీర్తి సౌఖ్యము లొనఁగూడి, క్షేమముగను
జీవితము వెల్గుఁ గావుత శ్రీధరు కృప!
.
ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు


16, అక్టోబర్ 2016, ఆదివారం

ముందుచూపు!

image of an ant and a grasshopper కోసం చిత్ర ఫలితంimage of an ant and a grasshopper కోసం చిత్ర ఫలితంimage of an ant and a grasshopper కోసం చిత్ర ఫలితంimage of an ant and a grasshopper కోసం చిత్ర ఫలితం


ఒక్క పొలమున నొక చీమ యొక్క మిడుత
కాఁపురమ్ముండె; చీమయె కాంక్షమీఱ
ధాన్యమును సేకరింపఁగఁ దల మునకలయి
యుండ, మిడుత యాడుచుఁ బాడుచుండు! 1

పొలములో రాలి పడినట్టి పొట్టి గింజ
నొక్కదానినిఁ జీమయే నోటఁ గఱచి
పట్టుకొని పుట్టలోననుఁ బెట్టుచుండ
మిడుత కని మేలమాడెను మిక్కుటముగ! 2

దాని చేష్టలకుం జీమ తగవు పడక,
"యేల నవ్వుచుంటి మిడుత యీవిధముగ?"
ననఁగ మిడుత "నిన్నుం జూడ నాకు జాలి
కలుగు; నీవెంత? నీదు నాఁకలియు నెంత?

ప్రతిదినమ్మును ధాన్యమ్ముఁ బఱఁగఁ గొనియుఁ
బుట్టలో దాచిపెట్టుదు వోయి యేల?
నన్నుఁ జూడుము దినమంత నలుపు సొలుపు
లేక యాడిపాడుదుఁ జింత లేక నేను! 4

నీవు నావలె నుండక యావురావు
రనుచు నెపుడు గింజలను సంగ్రహణ సేయు
పనిని నేకాగ్రముగఁ జేతు?" వనఁగఁ జీమ
బదులు వల్కకయే తన పనికిఁ జనెను! 5

కొన్ని దినముల పయిఁ బంటఁ గోసి రైతు
తీసికొనిపోవ, నింతలో వేసవి సని,
వర్షముల కాల మేతెంచఁ ద్వరిత గతినిఁ
జీమ హాయిగాఁ దనయింట సేదదీఱె! 6

గడుసు వానల కతమున మిడుత తడిసి,
యాఁకలికి నోర్వఁజాలక యటునిటు సని,
యేది దొరుకక, వణఁకుచు యెటులొ చీమ
పుట్ట చెంతకుఁ జేరియుఁ బొగిలె నిటుల! 7

"మిత్రమా! యిల్లు కోల్పోయి మిడుకుచుంటి;
నిట్టి వానలోఁ దినఁగాను నింత తిండి
యైనఁ గనరాదు; దరిఁజేరఁగాను నన్ను
నీదు గృహమున వసియింప నీయు మిపుడు! 8

ఆఁకలినిఁ దీర్ప నాహార మైన నీయు"
మనుచు వేడంగ, నగుచుఁ జీమ దయఁ బూని,
తాను సంగ్రహించియు లోన దాచినట్టి
గ్రాసమునఁ గొంత యిచ్చి, యాఁకలినిఁ దీర్చె! 9

పిదప చీమయె "మిత్రమా, వినుము! నేను
ముందు వచ్చు వర్షాకాలమునుఁ దలంచి,
మున్నుగాఁ దిండిగింజల నెన్నొ తెచ్చి
నాదు పుట్టలో దాచి, యిన్నాళ్ళు తిందు! 10

సమయ మెఱిఁగియు మెలఁగుచో సంకటములు
దరికిఁ జేరవు; నీ వింక తరుణ మెఱిఁగి
కష్టపడి తెచ్చి, దాచ, మున్ గలుగు సుఖమ!"
టంచుఁ బల్కి సన, మిడుత టపటప సనె!
గాన, ముందు చూపున్నచోఁ గలుగు సుఖము!! 11


స్వస్తి


11, అక్టోబర్ 2016, మంగళవారం

వివేకము లేని విద్య!

image of four students and a lion in a telugu story కోసం చిత్ర ఫలితంimage of four students and a lion in a telugu story కోసం చిత్ర ఫలితం



ఒక్క యూరిలో నలుగురు యువకు లుండ్రి;
వార లొక మునిం జేరి, "యెవ్వారలకును
నేర్పనటువంటి విద్యల నిపుడు మాకు
నేర్పి గొప్పవారలఁ జేయుఁ" డనియును వేడ; 1

మునియు నది విని, "వాటిచేతను నిడుములె
గాని, యుపయోగ ముండదు! కాన వద్ద
టంచుఁ బల్కుచుంటిని! మీరడగనె వలదు!
నేను నేర్పఁగా వలదయ్య! నిక్క మిదియ!" 2

అనిన ముని మాటలకు వార "లట్టి విద్య
నేర్పుఁ" డని పట్టుఁ బట్టియు నేర్చుకొనిరి!
తిరిగి వచ్చుచు నట నొక తరువు క్రింద
విశ్రమింపఁగఁ జని యొక వింతఁ గనిరి!! 3

చెట్టుకడ నొక్క చచ్చిన జీవియొక్క
యవయవమ్ములుఁ జివికియు నటఁ గనఁబడె!
వానిఁ జూడంగనే పెద్దవానికి నొక
యోచనము తోఁచె నప్పుడా యోచనమును; 4

మువ్వురకుఁ దెల్పఁ గా ననె "మునుపు మనము
నేర్చి నటువంటి విద్యల నిటనుఁ జూపి,
దీనిఁ బ్రతికించుటే మన తెలివికిఁ గల
గొప్ప పరమార్థ మగు ననుకొంటి" ననెను! 5

అదియ విని రెండవ యతండు ననియె నిట్టు
"లవునవును! నేఁడిదియె మన కగును జయము!
నాదు విద్యచేె నెముకల నచటఁ బేర్చి,
జంతు రూపమ్ముఁ దెచ్చెద సరిగ వినుఁడు!" 6

అనఁగ మూఁడవ వాఁడనె "నంతె కాదు!
నాదు విద్యా మహిమచేత నవ్యమైన
సరణిచే నేను రక్త మాంసముల నిచ్చి,
పూర్వ రూపమ్ము నిడెదను పూర్తిగాను!" 7

అనిన వారితోఁ బెద్దవాఁ డనియె "నేను
నాదు విద్యచే దానిఁ, బ్రాణమ్ముఁ బోసి,
మనఁగఁ జేసెదఁ; జూడంగ మఱల నదియుఁ
బూర్వ మున్నట్లె వర్తించు మురియుచు నిఁక!" 8

అనుచు మాట్లాడుచుండ నాల్గవయతఁ డనె
"నన్నలార! మీ విద్యల నన్ని యిచటఁ
జూపఁగారాదు! వలదయ్య! చూడ నాకుఁ
గీడు కన్పట్టుచున్నది! వీడుఁ" డనియె! 9

అంత వారలు నగవుచు ననిరి "నీవు
మాటలాడంగ వలదోయి! మాట లాపి,
మేము సేయున దిచట నదేమియొ కని,
మెప్పు లిడుమోయి మాకును మిక్కుటముగ!" 10

అనఁగ నొకఁ డస్థికలనిడ; నట్లె యింకొ
కండు రక్తమాంసా లిడె ఘనత మీఱ;
నంత నదియె సింహాకృతిం దాల్చఁ; బెద్ద
వాఁడు జీవమ్ము నిడఁ జన, "వ" ద్దటంచు; 11

చిన్నవాఁ డాపి, దరినున్న చెట్టు నెక్కి,
"యిప్డు బ్రతికించుఁ" డన, వాఁడు నిడె నుసురులు!
ప్రాణమునుఁ బొంది, లేచి, హర్యక్ష మప్పు
డాగ్రహము, నాఁకలినిఁ బొందె; నంత వారు; 12

సంభ్రమాశ్చర్యములతోడ సటల మెకముఁ
జూచుచుండంగనే, యది, చూచువారిఁ
జంపి, తిని, తన దారిని సాఁగిపోవఁ
జిన్నవాఁడు చెట్టును దిగి, తిన్నగఁ జనె! 13

చూచితిరె మీరు! గురు వటఁ జూపినట్టి
బాటఁ జనక, మువ్వురు కీడు వలచియుఁ జని,
చచ్చిరయ! చిన్నవాఁడు దాఁ జావుఁ గొనక,
వేగ చెట్టెక్కి, బ్రతికె, వివేకి గాన! 14

స్వస్తి


4, అక్టోబర్ 2016, మంగళవారం

మంత్రి తెలివి!



ఒక్క రాజుగారికిఁ బల్వు రూడిగీండ్రు
కలరు సేవల నొనరింపఁగాను మిగుల!
నందఱును నమ్మకము గలయట్టి వారె!
రాజుకొఱకు కష్టములందు వ్రాలువారె!! 01


ఒక్క దినమున రాజు శుద్ధోదగాహ
మునుఁ జలుపఁగం జనుచుఁ దన ముద్రిక నొక
స్వర్ణ పేటిక యందున భద్రముగను
నుంచి స్నానమ్ముకై సనె నంచితముగ! 02


రాజు స్నానమాడియు వచ్చి రభసముగను
ముద్దుటుంగరమునుఁ దాల్చఁబోవఁ, బెట్టె
నుంగరము మాయమాయె! వరాంగుళీయ
కమ్ము కానుపించని కారణమ్మదేమొ? 03


తనదు పెండ్లినాఁటి బటువు; ఘనమగు నుడు
గరయునైనట్టి యయ్యది కానఁబడక
యుండఁగా నెవ్వ రూరక యుందు రయ్య?
రాజు వేగమే మంత్రిని రమ్మనమనె! 04


మంత్రి వచ్చిన తోడనే మన్ననమునఁ
గూరుచుండంగఁజేసియుఁ గూర్మిమీఱ
జరిగినట్టి వృత్తాంతమ్ము సాంతముగను
దెలిపి, దొంగనుఁ బట్టించు వలనుఁ గోరె! 05


మంత్రి యెంతయు యోచించి, మంచివార
లైన సేవకులకుఁ గీడునైన నీయ
కుండ దొంగనుఁ బట్టంగఁ గోరిక మెయి
నొక్క యాలోచనము సేసె నక్కజముగ! 06


యోచనము సేసి యిట్లనె "నోయి రాజ!
సేవకులఁ బిలిపింపుఁడు శీఘ్రముగను!
వారితో మాటలాడి నేఁ జోరునిఁ దగఁ
బట్టుకొందును తప్పక పార్థివ వర!" 07


వెంటనే రాజు వారలఁ బిల్వనంప,
వార లందఱు వచ్చిరి పరుగుతోడ!
మంత్రి వారికి నొకకొన్ని మంత్రపూత
మైన పుడుకల నిడి పల్కె మానితముగ! 08


"సేవకోత్తములార! విశిష్టమైన
యీ పుడుకలను మీరలు హితముఁ గోరి
చేత ధరియించి దైవమున్ స్థిరముగాను
ప్రార్థనము సేసి నా కిండు రాణమీఱ! 09


ఇవియ మాహాత్మ్యమున్నట్టియవియ కాన,
చోరహస్తంపుఁ బుడుక యించుక పెరుఁగును!
కాన, దొంగ తప్పక దొరుకంగఁ బట్టు
మార్గ మిద్దియ యగు! మీకు మంచి జరుగు!!" 10


అనఁగ విన్న చోరుఁడు శీఘ్ర మతని చేతఁ
గల పుడుకను దా నొకయించుక విఱిచి వెసఁ
జేత ధరియించి దైవమున్ స్థిరముగాను
ప్రార్థనము సేసియు మరలి వచ్చెనపుడు! 11


అంత మంత్రియు నందఱి హస్తములను
గల పుడుకలఁ బరీక్షించి, కడను నున్న
సేవకుని పుల్లనుం బరీక్షింపఁగానె
యించుకయ తగ్గియుం గానుపించె నదియె! 12


వెంటనే మంత్రి యతఁడె తా వెదకుచున్న
దొంగ యని గుర్తెఱింగియుఁ దొందరించి,
పట్టి బంధించి, చెఱలోనఁ బెట్టెనపుడు!
యుక్తిచేఁ గార్యముల్ దీరు నుత్తమముగ!! 13



స్వస్తి


2, అక్టోబర్ 2016, ఆదివారం

తొందరపాటు!


ఒక్క యూరను బ్రాహ్మణుం డొకఁడు గలఁ డ
తండు విష్ణుశర్మాభిధఁ దనరుచుండు!
నతని భార్యయె యన్నపూర్ణమ్మయనఁగఁ
బేరునకుఁ దగు గుణముచే వెలుఁగుచుండు!! 1

ఆమె ప్రేమతో వేసెడి యన్నపు మెతు
కులనుఁ దిని యొక్క ముంగిస కూర్మితోడ
నిల్లుఁ గాఁచుచు నుండును నెల్ల వేళ
లందు ఫణులు రాకుండ సురక్షితముగ! 2

ఒక్క దినమున బాపఁడు ప్రక్క యూర
జరుగు బ్రహ్మోత్సవములకుఁ జనఁగ నటులె
యతని భార్యయుఁ దమ పుత్రు నచటి తొట్టె
లో నిదురపుచ్చి నీటికై తానునుఁ జనె! 3

వార లేఁగుటఁ గాంచి సర్పరిపు వంత
నింటిలోనికి నేఁగి తా హితముఁ గనఁగఁ
గాఁపు గాయుచుండఁగ నొక్క కాళ మచటి
త్రాటిపై నుండి యుయ్యేల దరికి వచ్చె! 4

పామునుం గాంచి ముంగిస పరుగునఁ జని,
తొట్టెపైఁకి లంఘించియు దిట్టతనము
తోడ దానితో వడిగఁ బోరాడి దాని
ఖండములుగఁ జేసియుఁ జంపె ఘనత మెఱయ! 5

పేరునకు ముంగిసయె కాని, ప్రేమమునకు
మనుజు కన్నను నెక్కుడౌ మాన్యయదియె!
మేలు మఱచి కీడొనరించు కూళకన్నఁ
గొలఁది మేల్ గృతజ్ఞ యగు నకులము మిన్న! 6

అహిరిపువు సర్పముం జంపి యచటనె తన
ఘనతఁ జూపింప వేచి యుండిన క్షణమున
నీరముం దెచ్చు గేహిని నినదము విని
పరుగు పరుగున నెదురేఁగెఁ బ్రమదమునను! 7

నోట రక్తమ్ము కాఱ సంతోషముగను
నెదురయిన ముంగినిం గని ముదిత యపుడు
’తనదు కొమరునిఁ జంపె’ నటనుచుఁ దలఁచి
చేర రాఁగానె తన బిందెచేతఁ జంపె! 8

చంపి లోనికి నేఁగి తా సత్వరముగ
నూయెలను గల పుత్రుని డాయఁగఁ జని
సుఖముగా నిద్ర పోయెడి సుతునిఁ గాంచి
క్రింద ముక్కలై యున్నట్టి దృంభువుఁ గనె! 9

కనిన యంత ముంగిస యొనర్చిన కృతమ్ము
సర్వ మవగతమ్మాయెఁ బ్రశస్తమైన
త్యాగముం గని దుఃఖించెఁ దానొనర్చి
నట్టి ద్రోహమ్ముఁ దలఁచియుఁ దుట్టతుదకు! 10

చూచితిరె! మీరు మేల్గూర్చుచుండు జనులఁ
దొందరించియుఁ గీడునుఁ బొందఁజేయు
మౌఢ్యమందించెఁ గద దుఃఖ మాఢ్యులకును!
వలదు! దొసఁ గిడు తొందరపాటు వలదు!! 11


స్వస్తి



30, సెప్టెంబర్ 2016, శుక్రవారం

మేఁకపోతు గాంభీర్యం!





ఒక్క మేఁకల కాపరి యొక్కనాఁడు
తనదు మేఁకల మందఁ గాననమునందు
మేపి, మాపటి వేళకు మేఁకలఁ గొని
పోవుచుండఁగ, నొక కొన్ని పోటి పడెను! 01

"నేను ముం" దన, "నేను ముం""దేను ముంద"
టంచు మేఁకపోతులు గొన్ని యఱచుచు, మును
ముందు కుఱుకంగ, నొక మేఁకపోతు దారి
తప్పి, యడవిలోనికిఁ జని, తల్లడిల్లె! 02

అటవిలోఁ దిరుగాడుచు, నట నొక గుహ
కానుపింపఁగ, నందు వేగముగఁ జనియు,
విశ్రమించఁగ "సంతోష వేశ్మ మిదియ"
యనుచుఁ బొంగుచు హాయినిఁ గొని శయించె! 03

ఒక్క సింహము మేఁతకై యెక్కడెక్క
డో గమించియు, వేఁటాడి, వేగ రాక,
మాపటికి వచ్చి, గుహ చెంత మందహాస
మునను గర్జించ, మేఁకయు విని, హరిఁ గనె! 04

బయటి నుండియు వచ్చెడి పచ్చకనుల
మెకముఁ గని, మేఁక భయపడె మిక్కుటముగ!
సటల మెకము, బిలమ్మున ఛాగముఁ గన
కయె, మెఱయు నేత్రములఁ గాంచి కలవర పడి; 05

"గహ్వరమ్మున మెక మెదో కల" దనుచునుఁ,
గేసరియె భయమున లోని కేఁగ జడిసి,
బయటనే యుండె, నుదయాన బాగుగాను
దానిఁ గని, స్నేహమును జేయఁ గాను కోరి! 06

తెల్లవాఱుచుండఁగ మేఁక తెలివితోడ
నప్పుడే మేలుకొని చూచినటులఁ గనుచు,
"నెవఁడ వీ?" వన, సింహమ్ము "నేను సింహ
మునయ! మీ రెవ్వ?" రని యనె బుగులుతోడ! 07

దాని ప్రశ్నకు బదులీక, దానిఁ గనుచు,
"నోహొ! సింహానివే! నేను నోగిరమున
వేయి యేన్గుల, నొక నూఱు బెబ్బులులనుఁ
జంపి తింటిని! నా ప్రతిజ్ఞ యిదె వినుము! 08

ఒక్క సింహమ్మునుం జంపి, మెక్కు దనుక
నాదు గడ్డమ్మునుం దీయ నంచుఁ బ్రతినఁ
బూని యుంటిని! నేఁ డీవు పొసఁగితి విటు!
నిను వధించియు, నా గడ్డము నిఁకఁ దీతు!" 09

అనుచుఁ దల మోరగించియుఁ, దన గభీర
ముఖమునుం ద్రిప్పుచునుఁ, దన ముందు గాళ్ళు
రెంటినిం బైఁకి నెత్తియుఁ ద్రెళ్ళ నుఱుక;
సింహ మంతట భయపడి, చెలఁగి, పాఱె! 10

ఇట్టి యవకాశమునకయి యెదురుచూచు
మేఁక, "బ్రతుకు జీవుడ!" యని, మిక్కుటమగు
సంతసము నొంది, యింటికి సాఁగిపోయె!
"బలము లేకున్నచో, బుద్ధి బలమె ప్రోచు!!" 11


స్వస్తి



27, సెప్టెంబర్ 2016, మంగళవారం

మేఁకపోతు గాంభీర్యం!





ఒక్క మేఁకల కాపరి యొక్కనాఁడు
తనదు మేఁకల మందఁ గాననమునందు
మేపి, మాపటి వేళకు మేఁకలఁ గొని
పోవుచుండఁగ, నొక కొన్ని పోటి పడెను! 01

"నేను ముం" దన, "నేను ముం", "దేను ముంద"
టంచు మేఁకపోతులు గొన్ని యఱచుచు, మును
ముందు కుఱుకంగ, నొక మేఁకపోతు దారి
తప్పి, యడవిలోనికిఁ జని, తల్లడిల్లె! 02

అటవిలోఁ దిరుగాడుచు, నట నొక గుహ
కానుపింపఁగ, నందు వేగముగఁ జనియు,
విశ్రమించఁగ "సంతోష వేశ్మ మిదియ"
యనుచుఁ బొంగుచు హాయినిఁ గొని శయించె! 03

ఒక్క సింహము మేఁతకై యెక్కడెక్క
డో గమించియు, వేఁటాడి, వేగ రాక,
మాపటికి వచ్చి, గుహ చెంత మందహాస
మునను గర్జించ, మేఁకయు విని, హరిఁ గనె! 04

బయటి నుండియు వచ్చెడి పచ్చకనుల
మెకముఁ గని, మేఁక భయపడె మిక్కుటముగ!
సటల మెకము, బిలమ్మున ఛాగముఁ గన
కయె, మెఱయు నేత్రములఁ గాంచి కలవర పడి; 05

"గహ్వరమ్మున మెక మెదో కల" దనుచునుఁ,
గేసరియె భయమున లోని కేఁగ జడిసి,
బయటనే యుండె, నుదయాన బాగుగాను
దానిఁ గని, స్నేహమును జేయఁ గాను కోరి! 06

తెల్లవాఱుచుండఁగ మేఁక తెలివితోడ
నప్పుడే మేలుకొని చూచినటులఁ గనుచు,
"నెవఁడ వీ?" వన, సింహమ్ము "నేను సింహ
మునయ! మీ రెవ్వ?" రని యనె బుగులుతోడ! 07

దాని ప్రశ్నకు బదులీక, దానిఁ గనుచు,
"నోహొ! సింహానివే! నేను నోగిరమున
వేయి యేన్గుల, నొక నూఱు బెబ్బులులనుఁ
జంపి తింటిని! నా ప్రతిజ్ఞ యిదె వినుము! 08

ఒక్క సింహమ్మునుం జంపి, మెక్కు దనుక
నాదు గడ్డమ్మునుం దీయ నంచుఁ బ్రతినఁ
బూని యుంటిని! నేఁ డీవు పొసఁగితి విటు!
నిను వధించియు, నా గడ్డము నిఁకఁ దీతు!" 09

అనుచుఁ దల మోరగించియుఁ, దన గభీర
ముఖమునుం ద్రిప్పుచునుఁ, దన ముందు గాళ్ళు
రెంటినిం బైఁకి నెత్తియుఁ ద్రెళ్ళ నుఱుక;
సింహ మంతట భయపడి, చెలఁగి, పాఱె! 10

ఇట్టి యవకాశమునకయి యెదురుచూచు
మేఁక, "బ్రతుకు జీవుడ!" యని, మిక్కుటమగు
సంతసము నొంది, యింటికి సాఁగిపోయె!
"బలము లేకున్నచో, బుద్ధి బలమె ప్రోచు!!" 11


స్వస్తి


26, సెప్టెంబర్ 2016, సోమవారం

దొరికిన దొంగ...






ఒక్క నాఁడొక యడవిలో నొక్క బాలుఁ
డజపుఁ; డట గొర్ల మేపుచుండంగ, నొక్క
దొంగ, బాలునిం గనక, తా దొంగిలించి
నట్టి ధనము లెక్కించుకొనంగ సాఁగె! 1

వానిఁ గనఁగానె బాలుండు, వాఁడు దోచు
కొన్న ధనమంత, యుక్తినిఁ బన్ని, దోచఁ
బడిన వారికే యీయంగ వలెనటంచుఁ
దలఁచి, యెలుఁగెత్తి యేడ్వఁ దొడంగె నపుడు! 2

బాలుఁ డట్టు లేడ్చెడి కతం బరయఁగానుఁ
జనియు, "బాలకా! యెందుల కనియు నీవు
నేడ్చుచుంటివి? కారణ మ్మిపుడు నాకుఁ

జెప్పుచోఁ దీర్పఁ గందును! చెప్పు"మనియె! 3

ఏడ్చుచున్నట్టి బాలుండు, నేడ్పు నాపి,
"యయ్య! నా తల్లి యొక గొఱ్ఱె నమ్మి, నాకు
నొక పసిఁడి యుంగరముఁ గొనె నోయి! యదియె

బిగుతుగా లేక, సడలి, బావిం బడెనయ!! 4

ఉంగరము లేక యింటికి నుత్క్రమింప,
నాదు తల్లియె దండించు ననుచు నేను

నేడ్చుచుంటిని!" యనఁగానె, యెంత యేని
నెదను సంతసించి, పసిఁడినిం దలంచి; 5

’అహహ! యేమి నా భాగ్యమ్ము! యాదవార్భ
కుండు పోఁగొట్టు కొన్నట్టి మెండియమును
బావిలో దూఁకియు, వెదకి, పట్టుకొనియు,

"దొరుక లే" దంచుఁ జెప్పి, కొందు నయ దాని!’ 6

అనుచు యోచించి పశ్యతోహరుఁడు వెసను,
"బాలకా! నేను వెదికెద బావిలోన!
వెదకి తెచ్చియు నిచ్చెద! వ్యథను వేగ

వీడి, యిచ్చటి మూటఁ గాపాడు" మనియు; 7

చెప్పి, బావి నుఱికి, గవేశించుచుండ;
బాలుఁ డా మూటనుం గొని, పల్లెకుఁ జని,
పెద్దలకు జరిగినయట్టి విధము నంతఁ
జెప్పి, వారి తోడుత బావి చెంతకుఁ జనె! 8

వారు నడవిలో నున్నట్టి బావి చెంతఁ
జనఁగ, నింకను నందు నుత్సాహమునను
నుంగరమునకై వెదకుచు నున్న దొంగ
యుంగరముఁ గానక నిరాశ నొంది యపుడు; 9

పైకి వచ్చునంతనె వేగ వచ్చి, యతనిఁ
బట్టి, బంధించి, దోచిన వాని నన్ని
వారివారికి నిడి, శిక్షఁ బఱఁగ నిడిరి!
పిట్ట కొంచెమైననుఁ గూఁత గట్టిది గద!! 10



స్వస్తి


25, సెప్టెంబర్ 2016, ఆదివారం

తెలివి...ఏ ఒక్కరి సొమ్మూ కాదు!


అడవి లోపల నొక నక్క యచటి జంతు
జాలములఁ జంపి తినుచును సంతసముగ
జీవనము సేయుచుండెను జిత్తు లడరఁ
బ్రతిదినమ్మును వేఁటయన్ వ్రతముఁ బూని! 1

ఒక్కనాఁడట వేఁటాడ నెక్కడయును
నొక్క జంతువునుం గూడఁ జిక్కకున్న
నలసట బలిమిచేతను నాఁకలిఁ గొని
నెమ్మదిగ వచ్చుచుండెను నీరసమున! 2

మడుఁగులో నీఁదు లాడియు మడుఁగు వీడి,
తీరముననున్న భూమిపై తిరుగుచున్న
యొక్క తాఁబేటినిం జూచి, యుత్సుకతనుఁ
బూని, యలఁతి సత్తువఁ, బట్టఁ బూనె నక్క! 3

తననుఁ బట్టంగ వచ్చు నక్క నటఁ గాంచి,
"యయ్యొ, దైవమా! వచ్చు నీ యాపద నిఁకఁ
దప్పిపోవంగఁ జేయుమా, యొప్పిదముగ!"
ననుచుఁ బ్రార్థించి, వేగమ్ముగను బరువిడె! 4

పరుఁగు లెత్తెడి తాఁబేటిఁ బట్టుకొనఁగ
ననుసరించియు నక్క దానినిఁ బదమున
నొక్కిపట్టియు బంధించి, మిక్కుటమగు
నాఁకఁటి వెతఁ దీర్చుకొన నాయత్తమాయె! 5

అట్లు తన నారఁగించ నాయత్తమైన
నక్క వాలకమునుఁ గని యక్కమఠము
భయము మెయిఁ దలఁ గాళ్ళను రయముగాను
డిప్పలోనికి దూర్చెఁ దా నొప్పుగాను! 6

నక్క దానినిఁ దినఁగాను నొక్కతఱినిఁ
బండ్లతో దాని డిప్పనుఁ బట్టి కొఱుక;
నెట్టి మాంసమ్ము దాని పంటికిని దొరుక
కున్న; నొక బండ ఱాతికిఁ గొట్టఁ బూనె! 7

దానిఁ బసిగట్టి కూర్మమ్ము దాని తోడ,
"నక్కబావా! ననున్ నీట నానఁబెట్టి,
తినఁగఁ బూనుచో, మెత్తఁబడెదను గాన,
సులభముగ నీవు ననుఁ దినఁ గలుగుదు వయ!" 8

అనిన తాఁబేలు మాటల నాలకించి,
చెఱువు లోపలఁ బెట్టియుఁ, జెదరి చనక
యుంటకై దానిపైఁ గాలి నుంచి, నొక్కి
పెట్టె, నది నానుటకయి తా నట్టి తఱిని! 9

కొంత సేపైన పిమ్మటఁ గూర్మము విన,
"మెత్తఁ బడితివె నీ వింక నిత్తఱి నట"
ననఁగఁ దాఁబేలు "వినుమయ్య, నక్కబావ!
యంత నానితిఁ, బాదమ్ము పొంతఁ దక్క! 10

కాలి నుంచిన చోటున గట్టిగానె
యున్నదయ్య! కాలినిఁ దీసియును మఱలఁగఁ
బెట్టుచో నానఁ గల" నంచు నొట్టుపెట్టి,
పలుక, నమ్మి, యట్టులె సేయఁ, బరుగునఁ జనె! 11

"నక్క జిత్తు లన్నియు నుండ నాదు చెంత,
నీటఁ దప్పించుకొనియెఁ దాఁబేటి బుఱ్ఱ!"
యనుచు నక్కయె నకనక లాడుచుఁ జనె!
తెలివి యొక్కరి సొత్తు కా దెప్పటికిని!! 12


స్వస్తి


గమనిక:
మిత్రులారా! ఈ దిగువ మీరు పెట్టే ప్రోత్సాహక వ్యాఖ్యలే. నన్ను ద్విగుణీకృత ఉత్సాహవంతుణ్ణి చేసి, మరిన్ని పద్య కథలు రాయడానికి పురికొల్పుతాయి. కావున ఈ దిగువన గల డబ్బాలో వ్యాఖ్యను పోస్టు చేయగలరని మనవి.


24, సెప్టెంబర్ 2016, శనివారం

మోసాన్ని...మోసంతోనే గెలవాలి!




ఒక్క నది యొడ్డుననుఁ గల దొక్క మేడి
చెట్టు; దానిపై నొక కోఁతి స్థిరము గాను
జీవనము సేయుచుండెను చింతలేక,
మేడిపండ్లనుఁ దినుచును మిత హితముగ! 1

ఆ నదినిఁ గల దొక్క నీరాట; మెపుడు
వానరము తిని, వేసెడి పండ్ల నన్ని
తానుఁ దినుచునుఁ, గొన్నియుఁ దన సతికినిఁ
బెట్టుచుం, బ్రేమగాను జీవించుచుండె! 2

ప్రతిదినమ్మునుఁ గపి మేడిపండ్లు దినుట;
కొన్ని నదిలోనఁ బడవేయ, గోముఖమ్ము
తినియుఁ, గొన్ని భార్యకు నిడుటయును జరుగును!
మొసలి భార్యయె యొకనాఁడు మొసలితోడ; 3

"నీవు తెచ్చెడి మేడిపం డ్లింత రుచియుఁ
గలిగి యుండంగ, నా ప్లవంగంపు గుండె
యెంత రుచిగ నుండు నని యోచింపఁ గాను
నోట నీరూరు చుండెఁ; దెం డొప్పిదముగ!" 4

అనిన భార్య మాటకు నెదు రాడలేక,
మొసలి, నది యొడ్డునకు వేగఁ బోయి, కపినిఁ
గనుచు, "మిత్రమా! నీవు నాకును ఫలముల
నీయ, నేను నీకును విందు సేయఁ దలఁచి; 5

పిలువ వచ్చితి! రావయ్య, వేగముగను!"
ననిన మొసలి మాటలకుఁ దా ననుమతించి,
మొసలి పైనెక్కి చనుచుండ, మొసలి దీన
ముగనుఁ గన్నీటి నిడఁ, గోఁతి, మొసలిఁ జూచి; 6

"మిత్రమా! వగపేల? యేమి జరిగెనయ?"
యనఁగ, మొసలి తా నేడ్చుచు ననియె, "మిత్ర!
నాదు సతి నెద్దియో వ్యాధి నవయఁ జేయ,
వైద్యుఁ డొక మందు నిచ్చిన బ్రతుకు ననెను!" 7

అనఁగ, "నే మందొ... చెప్పు" మటంచుఁ బలుక,
మొసలి, "కోఁతి గుండెయె మందు! పోయి తెమ్మ
టంచుఁ దెలిపె వె" జ్జనఁ గోఁతి, ’యరె! యిది నను
మోసగించి, యిటకుఁ దెచ్చె! మోసమునకు; 8

బదులు మోసమే తగు’ నని మదినిఁ దలఁచి,
యాదరముతోడ నిట్లనె, "నయ్యొ, మిత్ర!
నాదు గుండెను చెట్టు పైననె యిడితిని!
చెట్టు పై నున్న యప్పుడే చెప్పవైతి! 9

ఐన నేమాయె! వెనుకకు నరుగు మయ్య;
చెట్టుపై నున్న గుండెఁ దీసికొని వత్తు!"
ననఁగ, మఱలియుఁ, గీశ మున్నట్టి చెట్టు
చెంతకునుఁ గొని పోవంగఁ, జెట్టు నెక్కి; 10

కపియు నిట్లనె, "ధూర్తుఁడా! కమ్మగాను
నమ్మఁ బలికియు, వంచింప నగునె నీకు?
గుండెఁ జెట్టుపైఁ గలదనఁ గోరి నమ్మి,
వెనుకకును నన్నుఁ దెచ్చితి; విదె నమస్సు! 11

గుండె యెచటైనఁ జెట్టుపై నుండఁ గలదె?
నాదు గుండెనుఁ దినఁగోరి, నీదు భార్య
పన్నె యుక్తినిఁ; బొ"మ్మని పలికి, చనెను!
వంచనను, వంచనముననే వంచవలయు!! 12


స్వస్తి


గమనిక:
మిత్రులారా! ఈ దిగువ మీరు పెట్టే ప్రోత్సాహక వ్యాఖ్యలే. నన్ను ద్విగుణీకృత ఉత్సాహవంతుణ్ణి చేసి, మరిన్ని పద్య కథలు రాయడానికి పురికొల్పుతాయి. కావున ఈ దిగువన గల డబ్బాలో వ్యాఖ్యను పోస్టు చేయగలరని మనవి.

21, సెప్టెంబర్ 2016, బుధవారం

అందం కన్న...ఉపయోగం మిన్న!



ఒక్క యడవిని నొక దుప్పి చక్కనైన
లేఁత బంగరు జిగిఁ గల్గి, లేఁ జిగురులు
మేయుచును, జీవనమ్మునుఁ జేయుచుండె;
నదియ యొకనాఁడు సరసికిం దప్పికఁ జనె! 1

నీరు కడుపు నిండుగఁ ద్రావు కారణమున,
సరసిలోఁ జూచుచున్నట్టి తరుణమందుఁ,
దనదు ప్రతిబింబ మగపడఁ, దనివితీరఁ
జూచుకొనుచునుఁ, గొమ్ములఁ జూచుకొనియె! 2

’ఎంత యందమ్ముగా నుండె నివియ నాకు!
నింత చక్కని శృంగము లెవని కేనిఁ
గలవె?’ యనుకొని, యటుపైనఁ గాళ్ళఁ దిట్టె,
’సన్నమైనట్టి కాళ్ళు నిస్సార’ మనుచు! 3

తిట్టుచుండగ, నింతలో దిట్టమైన
నాద మెద్దియో వినఁబడ, నా దిశకునుఁ
జూడ, భయముఁ గొల్పుచుఁ, బెద్ద జూలు తోడ,
సింహ మొక్కటి రా సాఁగె జింక దెసకు! 4

సింహముం గనఁగానె యా జింక, వేగ
ముగ నరణ్యాన నుఱుకుఁ బరుగుల నిడుచుఁ
బాఱిపోసాఁగె నెన్నొ తుప్పలను దాఁటి,
యడ్డదిడ్డమ్ముగాఁ జనె నట్టి తఱిని! 5

ముందు వెనుకలఁ జూడక, ముందు కేఁగ,
గుబురుగా నున్నవౌ చెట్ల కొమ్మలకును,
నందముగ నున్న వనుకొన్నయట్టి కొమ్ము
లంతటం జిక్కి, రాకున్నఁ జింత పొడమె! 6

"ఎంత తెలివి తక్కువగ నే నిట్టి కొమ్ము
లందముగ నున్నవి యటంచు నాదరించి,
నన్నుఁ గాఁచిన కాళ్ళను, సన్నము లని
తెగడితిని! నాకు నిజముగాఁ దెలివి గలదె?" 7

అనుచు శాఖఁ దవిలిన కొమ్మునుఁ బెఱుకఁగ
నెంత పెనుఁగు లాడినఁ గాని సుంతయేని
సడల కుండంగ, "దైవమా! చావు నన్ను
వెదకుచును వచ్చెఁ; గావుమా, వేగ నన్ను!" 8

అనుచుఁ బ్రార్థించి, విశ్వాస మునిచి, మఱలఁ
గొమ్ములనుఁ బెఱుకంగ యత్నమ్ముఁ జేయు
చుం, దనదు కాళ్ళ నుంచియుఁ గ్రింద, భువినిఁ
దట్టుచును నెగిరిన యంతఁ, దగులము విడె! 9

డగ్గఱించెడి సింహము బిగ్గఱఁగను
గర్జనము సేయ, దుప్పియె కాళ్ళ కపుడు
బుద్ధి సెప్పియు, మృతికిని సిద్ధపడక,
వేగ బరువెత్తి ప్రాణ మా విధినిఁ గాచె! 10

’ఏవి తన కంద మిడెనని హెచ్చు నిడెనొ,
నట్టి కొమ్ము లాపద నిడె! నటులె, యేవి
యంద హీనము, సన్నము లనెనొ, నట్టి
కాళులే రక్షణము నిడె ఘనము గాను!’ 11

అనుకొనుచు జింక యా దైవమునకు మ్రొక్కెఁ;
దనకు నిడెను పునర్జన్మ మనుచు! వెడలి,
తోడి జింకల మందతోఁ గూడె నంత!
నందమున కన్న, నుపయోగ మంద మిడదె? 12


స్వస్తి



గమనిక:
మిత్రులారా! ఈ దిగువ మీరు పెట్టే ప్రోత్సాహక వ్యాఖ్యలే. నన్ను ద్విగుణీకృత ఉత్సాహవంతుణ్ణి చేసి, మరిన్ని పద్య కథలు రాయడానికి పురికొల్పుతాయి. కావున ఈ దిగువన గల డబ్బాలో వ్యాఖ్యను పోస్టు చేయగలరని మనవి.